Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT

Fidaa Movie Review

July 21, 2017
Sri Venkateswara Creations
Varun Tej, Sai Pallavi, Raja Chembolu, Sai Chand, Sharanya Pradeep, Geetha Bhaskar, Harshavardhan Rane, Nathan Smales, Sarah Berry, Lydia Pagan and Danielle Gregory
Sekhar Kammula
Vijay C Kumar
Marthand K Venkatesh
Suddala Ashok Teja
Shakthi Kanth
Dil Raju
Sekhar Kammula

సాయి పల్లవికి మళ్లీ 'ఫిదా' (రివ్యూ)

స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడొస్తాయా అని సదరు హీరోల అభిమానులు ఎదురుచూసినట్లుగానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తికాదు. అలాగని శేఖర్ కమ్ముల అభిమానులు హోర్డింగ్ పెట్టడం, పాలాభిషేకాలు చేయటం, థియోటర్ లో కాగితాలు విసరటం వంటివి చేయరు కానీ సిన్సియర్ గా సినిమా బాగుంటే ఫేస్ బుక్ లో పోస్ట్ లు,ట్విట్టర్ లో ట్వీట్స్ గట్రా పెట్టేసి టాక్ స్ప్రెడ్ చేస్తారు.

అలాగే శేఖర్ కమ్ముల సినిమాలకు మరో ప్రత్యేకత ఉంది. ఆయన సినిమా కు వెళ్లాలంటే ఆ సినిమాలో ఏ హీరో నటించాడు..హీరోయిన్ ఎవరు వంటివి కూడా పట్టించుకోరు. ఎవరు ఏ పాత్ర చేసినా చూడకుండా ఉండలేరు. గతంలో కొత్తవాళ్లతో అద్బుతాలు సృష్టించిన ఆయన మెగా క్యాంప్ హీరో,యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది. సినిమా ఏ మాత్రం బాగున్నా..సమస్య లేకుండా బౌండరీలు దాటేస్తుంది. ఆయన రెగ్యులర్ మార్కెట్ లోనే కాక మాస్ మార్కెట్ లోకి కూడా వెళ్లి దున్నేస్తుంది. అదే స్కెచ్ తో చేసిన ఈ సినిమా ఆ స్ట్రాటజీని నిజం చేసిందా.. ఈ మధ్య కాస్త వెనకబడ్డ శేఖర్ కమ్ములకు సక్సెస్ ఇచ్చిందా, చూసిన వాళ్లు ఫిదా అవుతున్నారా...అసలు కథేంటి.. వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదివాల్సిందే.

కథేంటి :

అన్న పెళ్లి కోసం అమెరికా నుంచి తెలంగాణ లో బాన్సువాడకి వచ్చాడు డాక్టర్ వరుణ్ (వరుణ్ తేజ్). ఆ పెళ్లిలోనే పెళ్లికూతురు చెల్లి భానుమతి(సాయి పల్లవి)తో...ఆమె అల్లరితో ఫస్ట్ లుక్ లోనే ప్రేమలో పడిపోయి..ప్రపోజ్ చేసే దాకా వెళ్లిపోయాడు. సర్లే కుర్రాడు ఇంతలా వెంటబడుతున్నాడు..చూడ్డానికి చక్కగా సినిమా హీరోలా ఉన్నాడు... అదీ అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ ..ఇవన్నీ ఆలోచించిందో లేదో కానీ ఆ కుర్రాడితో ఆమె కూడా పీకలోతు ప్రేమలో పడిపోయింది. బాగుంది..ఇద్దరూ..మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు...వాళ్ల ప్రేమకు అడ్డు పడటానికి పెద్దవాళ్లు ప్రయత్నాలు కూడా చేయటం లేదు...చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటారా... అంతా సవ్యంగా జరిగితే ఇది సినిమా కథ ఎందుకు అవుతుంది...

ఇక్కడో శేఖర్ కమ్ముల సినిమా టైప్ ట్విస్ట్ ...భానుమతికి త‌న ఊర‌న్నా, త‌న ఇల్లున్నా, తమ పొలమన్నా, తన తండ్రి అన్నా..ఇలా బోలెడు విషయాలంటే ఆమెకు చాలా ఇష్టం. (ఏం మనందరికీ ఆ ఇష్టలన్ని ఉండవా అంటే ...ఉంటాయి కానీ ఆమెకు ఉన్నంతగా ఊరిని విడిచి పెట్టి వెళ్లలేనంత ఉండదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను). దాంతో తనను ఇష్టపడ్డాడని...తను చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఇన్ని ఇష్టాలను ఒక్కసారిగా వదిలి... ఎందుకు వదిలి వెళ్లాలి అనే ఆలోచన ఆమెలో కలుగుతుంది. అంతేకాక పెళ్లయ్యాక...అబ్బాయి ఇంటికే అమ్మాయి వెళ్లాలా...అబ్బాయిలే ...చక్కగా అమ్మాయింటికిరావచ్చు కదా అనే విప్లవాత్మకమైన ఆలోచన వచ్చి అని అందరినీ ప్రశ్నిస్తూంటుంది. (దీన్ని ఇల్లరికం అందురు చాలా ప్రాంతాల్లో ఈ విషయం ఈ పిల్లకు తెలిసినట్లు లేదు). మరో ప్రక్క...వరుణ్ ఆలోచనలు ఆమెకు రివర్స్ లో ఉంటాయి. అమెరికాలో ఉంటూ తన కెరీర్ ని డవలప్ చేసుకుంటూ ఉండాలనేది అతని ఆకాంక్ష. అంటే అమెరికా వెర్శస్ తన సొంత ఊరు అన్నమాట.

ఈ నేపధ్యంలో భానుమతి...బహువిధాలుగా ఆలోచించి...సొంత ఊరుకే ఓటేసి.... తనకు అమెరికా కుర్రాడితో సరిపడదు అని ప్రేమను త్యాగం చేసేసి, ఇండియాలో తన ఊళ్లో ...ఇంటికి దగ్గరలో ఉన్న కుర్రాడిని చేసుకుందామని ఫిక్సైపోతుంది. అతని ప్రేమను రిజెక్ట్ చేసేస్తుంది. ఆ తర్వాత ఈ లవ్ స్టోరీ ఏమైంది...వారి ప్రేమ ఫలించిందా... వరుణ్, భానుమతి ఇద్దరు ఎలా ఒకటయ్యారు? ఇద్దరిలో ఎవరు దిగి వచ్చారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కొత్తకాదు కానీ కొత్తే...

నిజానికి ఇలాంటి 'పల్లెటూరు అమ్మాయి ..పట్నం కుర్రాడు' కథలు మన తెలుగుతెరకు కొత్తేం కాదు..గతంలోనూ బోలెడు వచ్చాయి..భవిష్యత్తులోనూ మరిన్ని వచ్చే అవకాసం ఉంది. అయితే ఇక్కడ కొత్త విషయం ఏమిటి అంటే శేఖర్ కమ్ముల హీరోయిన్ క్యారక్టర్ ని డీల్ చేసిన విధానం. తొలి చిత్రం 'ఆనంద్' నుంచి ఆయన హీరోయిన్ పాత్రలను విలక్షణంగా డిజైన్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోనూ సాయి పల్లవి పోషించిన భానుమతి పాత్రను చాలా స్ట్రాంగ్ గా ,సంఘర్షణాత్మకంగా రూపొందించారు. మరీ ముఖ్యంగా ఆ పాత్రకు తెలంగాణా యాస పెట్టడం హైలెట్ గా నిలిచింది.

కథ,కథనం

రొమాంటిక్ డ్రామా లేదా రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ చిత్రం స్క్రిప్టులో ఓ రొమాంటిక్ కామెడీకి ఉండాల్సిన లక్షణాలు,బీట్స్ అన్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే లీడ్ పెయిర్ మధ్య కాంప్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాని మీద ప్లే చేయలేదు. సెకండాఫ్ లో హీరో,హీరోయిన్ మధ్య వచ్చే కాంప్లిక్ట్ ని బేస్ చేసుకునే సీన్స్ పెద్దగా అల్లలేదు. ఫస్టాఫ్ అదరకొట్టిన ఈ స్క్రిప్టు సెకండాఫ్ స్లో అవటానికి అదే కారణం..క్లైమాక్స్ వచ్చేదాకా సర్దుకోలేదు.ముఖ్యంగా ఈ సినిమా లో చూపించిన హీరోయిన్ పాత్రలను ఫ్రై చేసే అంటే వేపుడు చేసే పాత్రలు అంటారు. తమలో తాము సంఘర్షించుకుంటూనే లీడ్ క్యారక్టర్స్ ని సంఘర్షణకు లోను చేస్తాయి. వారికి మనశ్సాంతి ఉండనివ్వవు. ఆ విషయంలో కథ సక్సెస్ అయ్యిందో లేదో కానీ చూసేవాళ్లకి మాత్రం సెకండాఫ్ లో మాత్రం సినిమాని కదలద్చకుండా..ఫ్రై చేసేస్తున్నాడనిపించింది.

కలిసిరాని క్లైమాక్స్

సినిమా మొదలెట్టి చాలా సేపు అయ్యింది ...టైం అయిపోతోంది.. క్లైమాక్స్ ఏదో ముగించాలి...అన్నట్లుగా అర్జంటుగా ముగించినట్లుంది. అంతేకానీ ఆ ముగింపుకు సరైన జస్టిఫికేషన్ లేదు. హీరో త‌న మ‌న‌సుని మార్చుకొని, ఇష్టప‌డిన అమ్మాయికోసం అమెరికా ఎలా వ‌దిలొచ్చాడ‌నే విష‌యాన్ని ఇంకాస్త క్లారిటీగా.. డెప్త్ గా చెప్పి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. లేదా తీన్ మార్ లో పవన్ కళ్యాణ్...త్రిష్ కోసం వెనక్కి వచ్చిన ప్పుడు చెప్పిన స్దాయిలో అయినా డైలాగులు పెట్టాల్సింది.

అనుమానం..అపార్దం...అసలు విషయం... పశ్చాత్తాపం

హీరో ని కలవటానికి హీరోయిన్.. వెళ్లినప్పుడు అక్కడ అతను వేరే అమ్మాయితో వేరే తలుపులు వేసుకున్న గదిలో కనపడటమో లేక వారి మాటలు వినపడటమో జరిగి హీరోయిన్ తనకు తోచినట్లు ఓ వెర్షన్ తయారు చేసుకుని అపార్ధం చేసుకుని దూరం జరగటం, ఆ తర్వాత క్లైమాక్స్ లో అసలు విషయం రివీల్ అవటం ..పశ్చాత్తాపం వంటివి జరగటం...చాలా చాలా పాత ఫార్ములా. ఈ ఫార్ములోనే ఈ సినిమాలో కీలక సీన్స్ రావటం నిజంగా ఘోరం. శేఖర్ కమ్ముల వంటి న్యూ జనరేషన్ డైరక్టర్స్ నుంచి అలాంటి సీన్స్ ఎక్సపెక్ట్ చేయలేదు.

సాయి పల్లవి సూపర్

సాయిప‌ల్ల‌వి ఈ సినిమా కు ప్లస్ అనేకంటే ఫెరఫెక్ట్ యాప్ట్. ఆమె లేకపోతే ఈ సినిమాలో చూడటానికి ఏమీ లేదు. ఆమె త‌న మాట‌తీరుతోనూ, త‌న అందంతోనూ, నటనతోనూ ఆక‌ట్టుకుంది. డ్యాన్సుల్లోనూ తన దైన ముద్ర తో చెలరేగిపోయి ఫిదా చేసేసింది. వరణ్ తేజ్ ఫ్యాన్స్ క్షమించెయ్యండి.

వరణ్ తేజ ఇన్నాళ్లకు..

ఈ సినిమాలో వరణ్ తేజను చూస్తూంటే..అరె ఇన్నాళ్లూ ఇంత టాలెంట్ ని అతను లోపలే దాచేసుకున్నాడే అనిపించింది. చాలా కంపర్ట్ గా , నాచురల్ గా కనపించాడు. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన ప్రతిభ చూపించాడు.

శేఖర్ సార్..

దర్శకుడుగా శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా ఈ రోజు చెప్పుకోవాల్సిందేమీ లేదు.ఆయన ఇలాంటి సినిమా కధలు రాయటంలోనూ, తీయటంలో సిద్దహస్తుడని ఎప్పుడో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాలో తెలంగాణా యాసను మాత్రమే కాక సంప్రదాయాలను కూడా చక్కగా తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నారు. డైలాగులు సూటిగా సుత్తిలేకుండా ,ఫన్ తో కలిపి అందించారు. సినిమా ఫస్టాఫ్ లో మొదటి నుంచి చివరి వరకూ...ప్రేక్షకులని అలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకెళ్ళి...అచ్చం మన ఇంట్లో, మన ఊరిలో ఉన్నామన్న ఫీలింగ్ ని ఇవ్వటం అంటే మాటలు కాదు.

టెక్నికల్ గా..

విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫి సినిమాకు పెద్ద ఎసెట్, తెలంగాణ పల్లె వాతావరణాన్ని, అమెరికా లోకేషన్స్ ను ఆయన కెమెరా అద్బుతంగా పట్టుకుని మన ముందుంచింది. ఇక మార్తండ్ కె వెంటేష్ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే బాగుండేదని సెకండాఫ్ లో చాలా సార్లు అనిపిస్తుంది. దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ ప్రతీ సినిమాలో లాగే బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్ గా సినిమాను తెరకెక్కించాడు. శక్తికాంత్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచాయి. తెలంగాణ బాణీలో సాగే 'వచ్చిండే..' పాట విజువల్గా కూడా సూపర్బ్ అనుకుండా ఉండలే.

ఫైనల్ గా...ఓ మాట

ఇది శేఖర్ కమ్ముల సినిమా మాత్రమే కాదు....సాయి పల్లవి సినిమా కూడా...ఆమె అభిమానులకు కూడా ప్రత్యేకమైనది.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT